top of page
  • Writer's pictureDr. Karuturi Subrahmanyam

ఉపవాసం చేసే ఉపకారం


ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో చాలా పద్ధతులు ఉన్నాయి. వాటిలో ఒకటి 16/8 విధానం. ఈ పద్ధతి ప్రకారం రోజూ 16 గంటల పాటు ఉపవాసం చేయాలి. ఈటింగ్ విండో

8 నుంచి 10 గంటలకు పరిమితం కావాలి. ఈ వ్యవధిలోనే 2, 3 లేదా అంతకన్నా ఎక్కువ భోజనాలను చేయవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. జంక్ ఫుడ్, అధిక సంఖ్యలో కేలరీలు తింటే ఈ పద్ధతి పనిచేయదు. భోజనాన్ని రాత్రి 8 గంటలకు చేసి, మర్నాడు మధ్యాహ్నం వరకు ఏమీ తినకుండా ఉంటే.. 16 గంటల ఉపవాసం చేసినట్లే. చాలా మంది 16/8 పద్ధతిని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌కు సరళమైన, స్థిరమైన మార్గంగా భావిస్తారు. వారానికి 2 రోజులు పాటు ఉపవాసం చేసేదే 5:2 డైట్‌. వారంలో 5 రోజులు తిని, 2రోజులు కేలరీలను 500 నుంచి 600కి పరిమితం చేయాలి. ఉదాహరణకు సోమ, గురువారాలు మినహా వారంలోని రోజూ సాధారణంగా తినవచ్చు.


ఈట్-స్టాప్-ఈట్ అనేది మూడో పద్ధతి. వారానికి ఒకటి లేదా 2సార్లు 24 గంటల ఉపవాసం చేయాలి. పూర్తిగా 24 గంటల పాటు ఉపవాసం..చాలా మందికి కష్టం .అందుకే 16/8 విధానంతో ప్రారంభించాలి. రోజు మార్చి రోజు ఉపవాసం చేయడం మరో పద్ధతి. ఈ పద్ధతిలో మీరు వారానికి చాలా సార్లు చాలా ఆకలితో పడుకుంటారు. పగటిపూట ఉపవాసం, రాత్రిపూట భారీగా భోజనం చేస్తే అది వారియర్‌ డైట్‌. పగటిపూట చిన్న మొత్తంలో పండ్లు, కూరగాయలు తినాలి. రాత్రి భారీగా భోజనం చేయాలి. అప్పటికప్పుడు భోజనం దాటవేయడం మరో పద్ధతి. ఆకలి, వండుకొనే తీరక లేకుంటే... భోజనం మాట మర్చిపోవాలి. ఈ పద్ధతుల్లో కొన్నింటితో గొప్ప ఫలితాలను పొందువచ్చు. ప్రయోగాలన్నీ చేసి....మీరు ఆస్వాదించే, మీ షెడ్యూల్‌కు సరిపోయేదాన్ని చివరికి ఎంచుకోండి.

బరువు తగ్గాలనుకునే వారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ను ప్రయత్నిస్తున్నారు. ఇన్సులిన్ తగ్గించి, గ్రోత్ హార్మోన్ స్థాయిలను పెంచడంతో పాటు కొవ్వును కరిగించే హార్మోన్ నోరాడ్రినలిన్ విడుదలను ఈ విధానం పెంచుతుంది. హార్మోన్లలో మార్పులతో స్వల్పకాలిక ఉపవాసం మీ జీవక్రియ రేటును 3.6 నుంచి 14 శాతం పెంచుతుంది. తక్కువ తినడంలో, ఎక్కువ కేలరీలను కరిగించడంలో సహాయపడి బరువు తగ్గడానికి కారణమవుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలా శక్తివంతమైన బరువు తగ్గించే సాధనమంటున్న అధ్యయనాలు......3 నుంచి 24 వారాలలో 3 -8 శాతం బరువు, నడుము చుట్టుకొలతలో 4–7శాతం తగ్గవచ్చని చెబుతున్నాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తక్కువ కండరాల నష్టాన్ని కలిగిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. జంతువులు, మానవులలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పై అనేక అధ్యయనాలు జరిగ్గా... ఈ పద్ధతి బరువు నియంత్రణకు, శరీరం, మెదడు ఆరోగ్యానికి శక్తివంతమైన ప్రయోజనాలను కలిగించగలదని చూపించాయి. ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడవచ్చని...క్యాన్సర్‌ను నివారించవచ్చని జంతు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అల్జీమర్స్ వ్యాధి నుంచి రక్షించవచ్చు అని చెబుతున్నారు. ఉపవాసం ఉన్న ఎలుకలు 36 నుంచి 83శాతం ఎక్కువ కాలం జీవించాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఉపవాస సమయంలో నీరు, కాఫీ, టీ, ఇతర కేలరీలు లేని పానీయాలు తీసుకోవచ్చు. ముఖ్యంగా కాఫీ ఆకలిని మందగింపచేస్తుంది. కాఫీలో చక్కెర కాకుండా పాలు లేదా క్రీమ్ కలుపుకోవచ్చు. సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. కానీ కొన్ని మందులు భోజనంతో తీసుకుంటేనే బాగా పనిచేస్తాయి. ఉపవాసం ఉన్నప్పుడు వ్యాయామం చేయవచ్చు. బరువులు ఎత్తడం, ప్రోటీన్ అధికంగా తీసుకోవటం చాలా ముఖ్యం. స్వల్పకాలిక ఉపవాసాలు వాస్తవానికి జీవక్రియను పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 3 లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు చేసే సుదీర్ఘ ఉపవాసాలు జీవక్రియను అణిచివేస్తాయి. పిల్లలకు ఉపవాసం మంచి ఆలోచన కాదు.


ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఖచ్చితంగా అందరి కోసం కాదు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక జీవనశైలి వ్యూహాలలో ఇది ఒకటి. తక్కువ బరువు ఉండి , రోగాల చరిత్ర ఉంటే వైద్యుడిని సంప్రదించకుండా ఉపవాసం చేయకూడదు. మందుల వాడేవారు, గర్భిణులు, బాలింతలు డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మంచి ఆహారం, సరైన వ్యాయామం, మంచి నిద్ర ...ఈ మూడూ దృష్టి పెట్టవలసిన ముఖ్యమైన అంశాలు. ఉపవాసం చేయడం అనే ఆలోచన మీకు నచ్చకపోతే... మీకు పనిచేసే విధానాన్ని కొనసాగించవచ్చు. మీరు దీర్ఘకాలం పాటు పాటించగలిగేదే మీకు ఉత్తమమైన డైట్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కొంతమందికి గొప్పది. మరికొందరికి కాదు. మీరు ఏ సమూహానికి చెందినవారో తెలుసుకోవడానికి ఏకైక మార్గం దాన్ని ప్రయత్నించడమే. ఉపవాసం చేస్తున్నప్పుడు మీకు బాగా అనిపిస్తే.....అది స్థిరమైన ఆహారపు పధ్ధతిగా కనిపిస్తే, బరువుతగ్గడానికి, మీ ఆరోగ్యాన్ని మెరుగు పర్చడానికి, ఎక్కువ కాలం జీవించడానికి ఇది చాలాశక్తివంతమైన సాధనం కావచ్చు.


డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం, MD, FRCP (లండన్), FACP (అమెరికా)

ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్


కిఫి హాస్పిటల్

దానవాయి పేట

రాజమండ్రి

ఫోన్ : 85000 23456

www.kifyhospital.com

bottom of page